తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారే..

జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.మాధవి

వికారాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని వికారాబాద్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆర్.మాధవి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల సర్వే/నమోదు కార్యక్రమం ద్వారా లక్షలాది బోగస్ ఓట్లు కనుమరుగు కానున్నాయని తెలిపారు. పశ్చిమ బెంగాల్ మాదిరిగా తెలంగాణలో కూడా నిజమైన ఓటర్లతో, అభివృద్ధిని ఆకాంక్షించేవారు, ప్రజా సమస్యలను పరిష్కరించేవారు అధికారం చేపడతారని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరును చూశారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి పట్టం కట్టడం ఖాయమని అన్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పని చేస్తోందని, అందుకే ప్రజలు వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీని ఆశీర్వదించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి బీజేపీని టార్గెట్ చేస్తున్నాయని విమర్శించారు. వికారాబాద్ జిల్లా నుండి ముఖ్యమంత్రి, స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ జిల్లాలో ఏమాత్రం అభివృద్ధి సాగడం లేదని, గతంలో ప్రారంభమైన పనులను సైతం కొనసాగించలేని పరిస్థితిలో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన బీజేపీకి ప్రజలు పూర్తి మద్దతు ఇస్తారని మాధవి ఆశాభావం వ్యక్తం చేశారు.