ఫైనల్‌లోకి భీమవరం బుల్స్

ఎలిమినేటర్‌లో సింహాద్రి లయన్స్
క్వాలిఫయర్-1లో అమరావతిపై 8 వికెట్ల ఘన విజయం
వర్షం కుదించిన ఎలిమినేటర్‌లో విజయవాడ సింహాద్రి విజయం
హేమంత్ రెడ్డి మెరుపు హాఫ్ సెంచరీ
ఎలిమినేటర్‌లో హనీష్ రెడ్డి విధ్వంసక ఇన్నింగ్స్
క్వాలిఫయర్-2లో అమరావతి రాయల్స్–సింహాద్రి లయన్స్ పోరు

విజయవాడ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు అభిమానులకు ఉత్కంఠభరిత క్రికెట్‌ను అందిస్తున్నాయి. ఆదివారం మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో జరిగిన రెండు కీలక పోరుల్లో భీమవరం బుల్స్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించగా, సింహాద్రి లయన్స్ ఎలిమినేటర్‌లో విజయవాడ సన్ షైనర్స్‌ను ఓడించి క్వాలిఫయర్-2కు చేరుకుంది.

భీమవరం దూకుడు..

క్వాలిఫయర్-1లో టాస్ గెలిచిన భీమవరం బుల్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కరణ్ షిండే 58, యువీవీ వర్మ 34 పరుగులతో రాణించగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భీమవరం బౌలర్లలో రవితేజ మూడు వికెట్లు, పీవీఎస్‌ఎన్ రాజు, రవికిరణ్ చెరో రెండు వికెట్లు తీశారు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భీమవరం బుల్స్ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఓపెనర్లు హేమంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి విజయానికి బలమైన పునాది వేశారు. హేమంత్ రెడ్డి 28 బంతుల్లో 57, రేవంత్ రెడ్డి 35, సాయి శ్రవణ్ 39 పరుగులతో చెలరేగడంతో భీమవరం 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. హేమంత్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

సింహాద్రి విజయం…

అంతకుముందు జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌ను వర్షం కారణంగా ఆరు ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సింహాద్రి లయన్స్ 6 ఓవర్లలో 6 వికెట్లకు 84 పరుగులు చేసింది. హనీష్ రెడ్డి కేవలం 12 బంతుల్లోనే 36 పరుగులు చేయగా, ధనుష్ 10 బంతుల్లో 27 పరుగులతో మెరిశాడు. 85 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విజయవాడ సన్ షైనర్స్ ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అశ్విన్ హెబ్బర్ (16), షేక్ జకీర్ అబ్బాస్ (21), సిద్ధార్థ్ (15) పోరాడినా నిర్ణీత 6 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 68 పరుగులకే పరిమితమైంది. సింహాద్రి బౌలర్లలో విజయ్, వినయ్ చెరో రెండు వికెట్లు, గిరినాథ్ రెడ్డి ఒక వికెట్ తీశారు. 16 పరుగుల తేడాతో సింహాద్రి లయన్స్ విజయం సాధించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.

ఫైనల్ బెర్త్ కోసం

ఇప్పుడు క్వాలిఫయర్-2లో క్యాపిటల్ అమరావతి రాయల్స్, సింహాద్రి లయన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌లో ఇప్పటికే స్థానం ఖాయం చేసుకున్న భీమవరం బుల్స్‌ను ఢీకొంటుంది.