ఉపాధ్యాయుల సేవలు మరువలేనివి..

  • ఉద్యోగ విరమణ చేసిన ప్రిన్సిపాల్ నాగం మాధవి శేఖర్ రెడ్డికి ఘన సన్మానం

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా విశిష్ట సేవలు అందించి ఉద్యోగ విరమణ చేసిన శ్రీమతి నాగం మాధవి శేఖర్ రెడ్డికి ఘన సన్మాన మహోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, అధ్యాపకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని ఆమెను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా నాగం మాధవి శేఖర్ రెడ్డి అందించిన సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఆమె ఎన్నో మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేసి, విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు.

ఉద్యోగ విరమణ అనేది సేవలకు ముగింపు కాదని, జీవితంలో మరో కొత్త అధ్యాయానికి నాంది మాత్రమేనని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా విద్యా, సామాజిక రంగాల్లో ఆమె సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు.