రెండు చుక్కల పోలియో మందు….
చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాట
శాంతినగర్ స్కూల్లో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్
పటమట, ఆంధ్రప్రభ : పల్స్ పోలియో సందర్భంగా ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు అందించే రెండు చుక్కల పోలియో మందు వారి బంగారు భవిష్యత్తుకు బాట అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. పోలియో వచ్చిన తర్వాత నయం చేయలేమని, రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అందుకే పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయన్నారు. ఆదివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని అశోక్ నగర్లోని శాంతి స్కూల్లో పల్స్ పోలియో కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ పోలియో రహిత దేశంగా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం మనందరి బాధ్యత అని చెప్పారు. పోలియో వస్తే పిల్లలు జీవితాంతం నడవలేరని, అందువల్ల ముందుజాగ్రత్తగా రెండు పోలియో చుక్కల వేయిస్తే వారు సురక్షితంగా ఉంటారన్నారు. మన దేశంలో పోలియో కేసులు నమోదు కావడం లేదని కాని పొరుగు దేశల నుంచి వైరస్ వచ్చే అవకాశం ఉందని.
అందువల్ల ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయించాలని చెప్పారు. పోలియో వచ్చిన తర్వాత నయం చేయలేమని అందువల్ల రాకుండా నివారించాలని అందుకు ఈ రెండు పోలియో చుక్కలతో పోలియో రాకుండా జాగ్రత్త పడవచ్చునని చెప్పారు. పిల్లలకు జ్వరం ఉన్నా, గతంలో ఈ చుక్కల మందు వేయించినా ఈ రెండు చుక్కల పోలియో మందు పిల్లలకు తప్పనిసరిగా వేయించాలని చెప్పారు. పోలియో రాకుండా రెండు చుక్కల మందు ఒక్కటే శరణ్యమని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కరీమ్, మేదరమెట్ల నారాయణ, చలసాని రమణ, పఠాన్ బాజీ, కార్పోరేషన్ ఎఎంహెచ్వో గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
