గోల్డ్ కోస్ట్ బీచ్‌గా పేరుపాలెం..

పర్యాటక అభివృద్ధితో ప్రాంతానికి కొత్త ఊపు

రైతుల ప్రయోజనాలకు తొలి ప్రాధాన్యం.. ఉపాధి, ఆర్థికాభివృద్ధికి విస్తృత అవకాశాలు: జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

నరసాపురం, ఆంధ్రప్రభ: నరసాపురం–పేరుపాలెం గోల్డ్ కోస్ట్ బీచ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.

గోల్డ్ కోస్ట్ బీచ్ తీరప్రాంతంలో ప్రతిపాదిత పర్యాటక అభివృద్ధి, దాని ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలపై ఆదివారం నరసాపురం ఆర్‌డీఓ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు.

గోల్డ్ కోస్ట్ బీచ్ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని అన్నారు. పర్యాటక అభివృద్ధి ప్రణాళికలను ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పరస్పర లబ్ధి చేకూరే విధంగా రూపొందిస్తోందని తెలిపారు.

నరసాపురం–పేరుపాలెం గోల్డ్ కోస్ట్ బీచ్ అభివృద్ధి చెందితే ఈ ప్రాంతం రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్ స్టేలు, రవాణా, చిన్న వ్యాపారాలు, వినోద సేవలు వంటి అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. సందర్శకుల రాకపోకలు అధికమైతే స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెంది, మొత్తం ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు.

అభివృద్ధి ప్రక్రియలో రైతుల హక్కులు, ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, చట్టపరమైన నిబంధనలను పూర్తిగా పాటిస్తూ రైతుల భాగస్వామ్యంతోనే అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి అపోహలు, అవాస్తవ ప్రచారాలను నమ్మకుండా ప్రభుత్వ అధికారుల ద్వారా సరైన సమాచారం తెలుసుకోవాలని రైతులకు సూచించారు.

ఈ సందర్భంగా విశాఖపట్నం బీచ్, సూర్యలంక బీచ్‌ల అభివృద్ధి అనంతరం అక్కడ ఏర్పడిన ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. గోల్డ్ కోస్ట్ బీచ్ అభివృద్ధి తర్వాత స్థానిక ప్రజలకు కూడా ఇలాంటి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

రైతులు తమ భూముల పరిధిలోనే పర్యాటక అనుబంధ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలు, సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలపై అవగాహన పెంచుకొని పర్యాటక రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

స్థానిక ప్రజల సహకారం, పారదర్శకత, రైతుల భాగస్వామ్యంతోనే గోల్డ్ కోస్ట్ బీచ్ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని, ఈ అభివృద్ధి వల్ల ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నరసాపురం ఆర్‌డీఓ దాసిరాజు, మొగల్తూరు తహసీల్దార్ రాజ్ కిషోర్, పర్యాటక శాఖ అధికారులు, గోల్డ్ కోస్ట్ తీరప్రాంత రైతులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.