వేగంగా గూడెం గుట్ట అభివృద్ధి పనులు..

  • పరిశీలించిన దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ డా. శశిధర్

దండేపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం (గూడెం గుట్ట) ఆలయ పునర్నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి ఆదివారం దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ డా. శశిధర్ ఆలయాన్ని సందర్శించి పనులను పరిశీలించారు.

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచనల మేరకు ఆలయానికి చేరుకున్న చీఫ్ ఇంజనీర్ డా. శశిధర్, ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు, అభివృద్ధి పనులు చేపట్టాల్సిన ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పనులను నాణ్యతతో, ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా డా. శశిధర్ దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు, దేవస్థాన అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, వేదాశీర్వచనం చేసి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్, అసిస్టెంట్ ఇంజనీర్లు సంతోష్, ప్రతాప్ రెడ్డి, దేవస్థానం సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు గడ్డం త్రిమూర్తి, అక్కల వెంకటేశ్వర్లు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.