నిండు జీవితానికి రెండు చుక్కలు..
దండేపల్లి, ఆంధ్రప్రభ : పిల్లల భవిష్యత్తును ఆరోగ్యవంతంగా, పటిష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం దండేపల్లి మండలంలోని గూడెంలో ఘనంగా నిర్వహించారు. ఐదేళ్లలోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు పిలుపునిచ్చారు.
పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా దండేపల్లి వైద్యాధికారి డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ, గతంలో పోలియో చుక్కలు వేయించినప్పటికీ ఈ విడతలో కూడా ప్రతి చిన్నారికి తప్పనిసరిగా చుక్కలు వేయించాలని సూచించారు. ఎలాంటి సందేహాలకు తావు ఇవ్వకుండా తల్లిదండ్రులు తమ చిన్నారులను సమీపంలోని పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి రెండు చుక్కల మందు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
