బాసరలో మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు..
- మహంకాళి ఆలయ చోరీ ఘటనపై ఆరా
బాసర, ఆంధ్రప్రభ : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అమ్మవారి సన్నిధిలో ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, వేద పండితులు మంత్రి చేత ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహింపజేశారు.
అనంతరం ఇటీవల చోరీ జరిగిన మహంకాళి అమ్మవారి ఆలయాన్ని మంత్రి సందర్శించి ఘటనపై ఆరా తీశారు. ఆలయ భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, మహంకాళి ఆలయంలో చోరీ ఘటన దురదృష్టకరమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతరం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు, టెండర్ల ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఆలయ ఈవో అంజనీ దేవితో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
