పోలియోను తరిమికొట్టాం..

మళ్లీ దరిచేరనివ్వొద్దు: ఎమ్మెల్యే బడేటి చంటి

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అని పిలుపు

ఏలూరు, ఆంధ్రప్రభ: మన దేశం నుంచి పోలియో మహమ్మారిని ఎప్పుడో తరిమికొట్టామని, అయితే అది మళ్లీ భావితరాల దరిచేరకుండా ఉండాలంటే తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హితవు పలికారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పవర్‌పేట సదానంద స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి సందర్శించారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యాధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజం నుంచి పోలియో మహమ్మారిని నిర్మూలించే లక్ష్యాన్ని భారత్ ఎప్పుడో సాధించిందన్నారు. అయినప్పటికీ అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం పల్స్ పోలియో యజ్ఞాన్ని ప్రతి ఏడాది నిరాటంకంగా కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని తెలిపారు.

ఆ లక్ష్యాన్ని విజయవంతం చేయడానికి తల్లిదండ్రులు, బాధ్యతగల పౌరులందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించేలా చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.