మారుమ్రోగిన. జగన్మాత నామస్మరణ..
ఇంద్రకీలాద్రిపై భక్తుల ప్రభంజనం…
మూడు రోజుల వరుస సెలవులతో దుర్గగుడికి పోటెత్తిన భక్తజనం…
భారీ రద్దీతో అంతరాలయ, వీఐపీ దర్శనాలు తాత్కాలిక నిలిపివేత…
విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు…
క్యూలైన్లలోనే చల్లని తాగునీరు….
అందరికి అన్నదానం, ప్రసాదాల పంపిణీ..
పాలకమండలి, అధికారుల సమన్వయంతో రద్దీ నియంత్రణ…
ప్రశాంతంగా అందరికి సాగిన అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో పాటు ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే కొండపైకి భక్తుల రాక భారీగా పెరగడంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిక్కిరిశాయి. ఉదయం 7 గంటల నుంచే క్యూలైన్లు నిండిపోగా, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ఈవో కిషోర్ కుమార్ పర్యవేక్షణలో ఏఈవోలు చంద్రశేఖర్, వెంకటరెడ్డి, రమేష్‌బాబు క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షించారు.
సాధారణ భక్తులకు వేగవంతంగా దర్శనం కల్పించేందుకు ఉదయం 10.30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అదే సమయంలో మధ్యాహ్నం 2.30 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేయడంతో సామాన్య భక్తులకు వేగంగా అమ్మవారి దర్శనం లభించింది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈసారి దేవస్థానం ప్రవేశపెట్టిన మొబైల్ వాటర్ క్యాన్ విధానం భక్తుల ప్రశంసలు అందుకుంది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకే సిబ్బంది చల్లని తాగునీటిని అందించడంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఎంతో ఉపశమనం పొందారు.
ఈ వినూత్న ఏర్పాటుపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ దేవస్థాన అధికారులను అభినందించారు. దీనితో పాటు ఆలయ ప్రాంగణంలో నిరంతరాయంగా ఉచిత ప్రసాదం, అన్నదానం నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం తర్వాత రద్దీ క్రమంగా తగ్గడంతో పాలకమండలి సభ్యులు, అధికారులు స్వయంగా క్యూలైన్లలో పర్యటించి భక్తుల అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆలయ సహాయ కమిషనర్ రంగారావు ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలు ఇస్తూ క్యూలైన్లను క్రమబద్ధీకరించగా, పాలకమండలి, అధికారుల సమన్వయంతో లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ యంత్రాంగం కల్పించిన సౌకర్యాలు, వేగవంతమైన దర్శన ఏర్పాట్లపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
