మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఘన నివాళులు
పీవీ జ్ఞానభూమి వద్ద అంజలి ఘటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని నడిపించిన దూరదృష్టి గల నాయకుడు: మంత్రి
హైదరాబాద్, ఆంధ్రప్రభ: భారత రాజకీయ చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించిన మహనీయుడు, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 105వ జయంతి వేడుకలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని, పీవీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌లతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరై పీవీ నరసింహారావుకు నివాళులు అర్పించి, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిన అపర చాణక్యుడు, దూరదృష్టి కలిగిన గొప్ప నాయకుడు పీవీ నరసింహారావు అని కొనియాడారు. క్లిష్ట సమయాల్లో దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా నిలబెట్టి, అభివృద్ధి పథంలో నడిపించిన మహానేతగా పీవీ నరసింహారావు చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోతారని, ఆయన చేసిన సేవలను దేశ ప్రజలు ఎప్పటికీ మరువలేరని మంత్రి పేర్కొన్నారు.
