భీంగల్లో ముమ్మరంగా ఎస్ఐఆర్ ఫారాల పంపిణీ
- ఓటరు వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలి
- కాంగ్రెస్ నాయకుల విజ్ఞ
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ పట్టణంలోని 171వ బూత్ పరిధిలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని, సంబంధిత బీఎల్ఓ తో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటర్లకు ఫారాల నింపే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రతి కుటుంబం తమ ఎస్ఐఆర్ ఫారంలో పేరు, వయస్సు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తిగా నమోదు చేయాలని సూచించారు.
సరైన వివరాలు నమోదు చేయడం ద్వారా ఓటరు జాబితా పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందుతుందని తెలిపారు. నింపిన ఫారాలను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు సంబంధిత బీఎల్ఓలకు లేదా ఎన్నికల అధికారులకు తప్పనిసరిగా అందజేయాలని కోరారు. ప్రజలు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు హక్కును పరిరక్షించుకోవాలని, కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, మార్పులు, తొలగింపులు వంటి అంశాలకు సంబంధించి అవసరమైన పత్రాలను జతచేసి సమర్పించాలని సూచించారు.
ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల శాఖకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్ర బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొదిరె స్వామి, జెజె నర్సయ్య, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, వీడీసీ అధ్యక్షులు పతాని కృష్ణ, ఉపాధ్యక్షులు తీగల రఘు, సీనియర్ నాయకులు ఆరేపల్లి నరేందర్, సంతోష్ నగర్ తాండ సర్పంచ్ శివ, కాంగ్రెస్ నాయకులు కత్రాజ్ శ్యాంరాజ్, మహేష్, మనోజ్ తదితరులు పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.
