Kondapur Restaurant Violations | పాలమూరు గ్రిల్‌కు ఫుడ్ సేఫ్టీ అధికారుల నోటీసులు
Kondapur Restaurant Violations | పాలమూరు గ్రిల్‌కు ఫుడ్ సేఫ్టీ అధికారుల నోటీసులు
కొండాపూర్ పాలమూరు గ్రిల్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు..
గడువు ముగిసిన ఆహార పదార్థాలు గుర్తింపు
లేబుళ్లలో మార్పులు, గడువు ముగిసిన మష్రూమ్‌ల వినియోగం గుర్తించిన అధికారులు
తుప్పు పట్టిన ఫ్రీజర్లు, అపరిశుభ్రమైన వంటగది.. యాజమాన్యానికి నోటీసులు
Kondapur Restaurant Violations | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలోని పాలమూరు గ్రిల్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల సందర్భంగా ఆహార పదార్థాలపై ఉన్న లేబుళ్లలో మార్పులు (లేబుల్ ట్యాంపరింగ్) చేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే గడువు ముగిసిన మష్రూమ్‌లు (పుట్టగొడుగులు) వినియోగానికి సిద్ధంగా ఉంచినట్లు తేలడంతో వాటిని అక్కడికక్కడే స్వాధీనం చేసుకుని పారవేయించారు.
అంతేకాకుండా రెస్టారెంట్‌లోని ఫ్రీజర్లు తుప్పు పట్టి ఉండటం, వంటగది పరిశుభ్రత లేకుండా ఈగలతో నిండి ఉండటం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాల అమలులో తీవ్ర లోపాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు తనిఖీ అనంతరం సంస్థకు 60 శాతం ఫుడ్ సేఫ్టీ కంప్లయెన్స్ స్కోర్ కేటాయించి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరించే హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
