అంగలూరు పాఠశాలను ఆకస్మిక తనిఖీ..
అంగలూరు పాఠశాలను ఆకస్మిక తనిఖీ..
ఈపూరు, ఆంధ్రప్రభ : మండలంలోని అంగలూరు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలకు వచ్చిన జీవి కి ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వాగతం పలికారు. ముందుగా చీఫ్ విప్ జీవీ పాఠశాల రికార్డులను, ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు పుస్తకాలను పరిశీలించారు. పాఠశాల మొత్తం కలియతిరిగి పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల దగ్గరకు వెళ్లి పలకరించి విద్య బోధన ఎలా ఉంది ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనం పథకం మెనూ నాణ్యత, వంట గదిలో పరి శుభ్రత గురించి తగిన సూచనలను చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నియమ నిబంధనల ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారాన్ని అందించడంలో ఎలాంటి పొరపాట్లు, లోపాలు రాకూడదని, నాణ్యమైన విద్యతోపాటు క్రీడా రంగాలలో కూడా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులకు చెప్పారు. ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న విద్యా కిట్లు, పాఠశాలలకు వచ్చాయా లేదా అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఏపీ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తమ పాఠశాలకు రావడంతో విద్యార్థులంతా ఆనందం వ్యక్తం చేస్తూ కేరింతలు కొట్టారు. కార్యక్రమంలో నర్రా కిషోర్, ఈపూరు మాజీ ఎంపీపీ బొల్ల వెంకట కోటయ్య, గ్రామ టిడిపి నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
