జిల్లా కలెక్టర్ ఆదేశాలతో..

ప్రభుత్వ భూమిలో అక్రమంగా వేసిన ఇల్లు తొలగింపు..

జన్నారం, ఆంధ్రప్రభ: ప్రభుత్వ భూమిలో అక్రమంగా వేసిన ఓ పక్క ఇల్లును జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాలతో పోలీసులు సమక్షంలో రెవెన్యూ,జీపీ అధికార్లు శనివారం ఉదయం కూల్చి వేశారు. ముందుగా ఆ ఇంట్లోని వస్తు సామాగ్రిని బయటకు తీయించి ప్రోక్లేనుతో ఇల్లును కూల్చివేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల మండలంలోని పొనకల్ గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 374లో 5 ఎకరాల 8 గుంటల ప్రభుత్వ భూమి ఉంది.ఈ ప్రభుత్వ భూమిలో దుర్గం లక్ష్మి అక్రమంగా ఆక్రమించుకొని సిమెంట్ ఇటుకలు,రేకులతో ఓ ఇల్లును నిర్మించుకొని నివాసముంటున్నారు.ఆ ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని ఇండ్లు షెడ్లు నిర్మించుకుంటున్నారని గ్రామానికి చెందిన కొందరు ఇటీవల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు, స్థానిక తాహసిల్దార్ ఫిర్యాదులు చేశారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక తాహసిల్దార్ డి. బక్కయ్య,స్థానిక ఎమ్మారై వెంకటేశం సూచనతో స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్, పోలీసులు సహకారంతో జీపీ,రెవెన్యూ ఉద్యోగులు ప్రోక్లేన్ తో ఆ భూమిలో అక్రమంగా వేసిన ఆ ఇల్లును కూల్చివేసి,శిధిలాలను తొలగించారు.ఈ విషయమై స్థానిక తాహసిల్దార్ బక్కయ్యను ఉదయం సంప్రదించగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమిలో అక్రమంగా వేసిన ఇల్లును తొలగించామన్నారు. పోనకల్ గ్రామ రెవెన్యూ శివారులోని 374లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఇల్లు నిర్మించారని,అందుకే నిబంధనల మేరకు ఆ ఇల్లును కూల్చి వేశామని ఆయన తెలిపారు.