2026 APL | అమరావతి రాయల్స్, భీమవరం బుల్స్ ఘన విజయాలు..

కెప్టెన్ యారా సందీప్ 93 పరుగులతో అమరావతికి అద్భుత విజయం..
విజయవాడ సన్ షైనర్స్‌పై 5 వికెట్ల తేడాతో రాయల్స్ గెలుపు..
కాకినాడను 118 పరుగులకే కట్టడి చేసిన భీమవరం బౌలర్లు…
11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన భీమవరం బుల్స్..
సందీప్, సిహెచ్ రవితేజలకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు..

2026 APL | ఆంధ్రప్రభ విజయవాడ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)–2026 సీజన్–5లో మూడో రోజు జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లు అభిమానులకు ఉత్కంఠభరిత వినోదాన్ని అందించాయి. తొలి మ్యాచ్‌లో క్యాపిటల్ అమరావతి రాయల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజయవాడ సన్ షైనర్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో భీమవరం బుల్స్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ కాకినాడ కింగ్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

కెప్టెన్ ఇన్నింగ్స్…

తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అమరావతి రాయల్స్, విజయవాడను 170 పరుగులకు ఆలౌట్ చేసింది. అశ్విన్ హెబ్బార్ (39), హర్షవర్ధన్ (37), డీబీ ప్రశాంత్ (47) రాణించినా, టోషిత్ యాదవ్, బండారు అయ్యప్ప చెరో రెండు వికెట్లు తీసి విజయవాడను భారీ స్కోరుకు దూరం చేశారు. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమరావతి తరఫున కెప్టెన్ యారా సందీప్ అద్భుత కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 61 బంతుల్లో 93 పరుగులు (6 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్ 27 పరుగులతో విలువైన సహకారం అందించాడు. 19 ఓవర్లలోనే 173/5తో లక్ష్యాన్ని ఛేదించిన అమరావతి విజయం సాధించగా, సందీప్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

దూకుడుగా భీమవరం బుల్స్..

రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కాకినాడ కింగ్స్, భీమవరం బుల్స్ బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. యువన్ ఒంటరి పోరాటం చేస్తూ 61 పరుగులు చేసినా, మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. సిహెచ్ రవితేజ నాలుగు వికెట్లు, పీవీఎస్‌ఎన్ రాజు మూడు వికెట్లు తీసి కాకినాడ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భీమవరం బుల్స్ ఓపెనర్లు హేమంత్ రెడ్డి (42), రేవంత్ రెడ్డి (48) ఆరంభం నుంచే దూకుడుగా ఆడగా, రవికిరణ్ 25 పరుగులతో మెరిపించాడు. కేవలం 11.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన భీమవరం బుల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. నాలుగు వికెట్లతో మ్యాచ్‌ను మలుపుతిప్పిన సిహెచ్ రవితేజకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.