భోపాల్‌లో సంచలనం.. కీలక మలుపు తిరిగిన మర్డర్ మిస్టరీ..!
- నిందితుడికి హెచ్‌ఐవీ పాజిటివ్
- 50 మందికి పైగా బాదితులు
- బాధితులను గుర్తించే పనిలో పోలీసులు
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఒక మర్డర్ మిస్టరీ దర్యాప్తుగా మొదలైన ఓ కేసు.. కీలక మలుపు తీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వెలుగులోకి వచ్చిన హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఓ ఫ్యాక్టరీ కార్మికుడి హత్య కేసులో అరెస్టైన 28 ఏళ్ల నిందితుడిని పోలీసులు విచారిస్తుండగా షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.
హెచ్‌ఐవీ పాజిటివ్‌గా ఉన్న ఈ యువకుడు.. గత కొన్నేళ్లలో దాదాపు 50 మంది పురుషులపై లైంగిక దాడులకు పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో బాధితులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
మే 24న మండీదీప్ ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీ కార్మికుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈ సందర్భంగా అతడు సంచలన విషయాలు వెల్లడించాడు. బాధితుడికి మంచి హోటల్‌లో వసతి కల్పిస్తానని నమ్మించి అతనిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు హెచ్చరించడంతో, రాయితో పలుమార్లు దాడి చేసి హత్య చేసినట్లు తెలిపాడు. అనంతరం మృతుడి మొబైల్ ఫోన్‌ను అపహరించి విక్రయించినట్లు కూడా పోలీసుల విచారణలో అంగీకరించాడు.
అయితే, హత్య అనంతరం మృతుడి మొబైల్ ఫోన్‌ను అపహరించి విక్రయించిన నిందితుడిని, అదే మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతడికి హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కేసు మరింత సంచలనంగా మారింది.
విచారణలో అతడు రాత్రివేళల్లో భోపాల్ వీధుల్లో ఒంటరిగా తిరిగే పురుషులను టార్గెట్ గా చేసుకుని లైంగిక దాడులకు పాల్పడేవాడని, బాధితులు సామాజిక పరువుపోతుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఇంతకాలం తప్పించుకున్నానని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

