వైద్యులు లేక ప్రసూతి సేవలు నిలిచిపోయాయి..

గర్భిణీలకు తీవ్ర ఇబ్బందులు
బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్టులు, మత్తు వైద్యుడు లేక ప్రసవాలు బంద్

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీలకు ప్రసూతి సేవలు గత కొద్దిరోజులుగా పూర్తిగా నిలిచిపోయాయి. ఆసుపత్రిలో ముగ్గురు గైనకాలజిస్టులు పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్కరు కూడా అందుబాటులో లేరు. సిజేరియన్ ఆపరేషన్లకు అత్యంత కీలకమైన మత్తు వైద్యుడు కూడా ఇన్‌సర్వీస్ పీజీ చదువుల కోసం రెండు నెలల క్రితమే వెళ్లిపోవడంతో ప్రసూతి విభాగం సేవలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

గతంలో పనిచేసిన ఇద్దరు గైనకాలజిస్టులను చెన్నూరు, లక్సెట్టిపేటలకు డిప్యూటేషన్‌పై పంపగా, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఏకైక గైనకాలజిస్టు లాంగ్ స్టాండింగ్ బదిలీల్లో భాగంగా ఇటీవల కాగజ్‌నగర్‌కు బదిలీ అయ్యారు. దీంతో ప్రస్తుతం గైనకాలజిస్టులు, మత్తు వైద్యుడు లేక ప్రసూతి విభాగం పూర్తిగా వెలవెలబోతోంది.

మూడు నియోజకవర్గాల గర్భిణీలకు తప్పని అవస్థలు..

బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల మారుమూల గ్రామాలకు చెందిన నిరుపేద, గిరిజన గర్భిణీలకు ఈ ఆసుపత్రి ప్రధాన వైద్య కేంద్రంగా ఉంది.

మత్తు వైద్యుడు లేకపోవడంతో సిజేరియన్ ప్రసవాలు పూర్తిగా నిలిచిపోయాయి. నార్మల్ డెలివరీలు నిర్వహించాలన్నా గైనకాలజిస్టులు లేక డ్యూటీ మెడికల్ అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవ ఖర్చులు అధికంగా ఉండటంతో నిరుపేద గర్భిణీలు అక్కడికి వెళ్లలేక, ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వైద్య విధాన పరిషత్ ఇన్‌చార్జ్ కమిషనర్, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి గైనకాలజిస్టులు, మత్తు వైద్యుడిని తక్షణమే నియమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.