పుత్తూరులో నూతన డీఎస్పీ కార్యాలయం ప్రారంభం..
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ప్రారంభోత్సవం
ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు
శాంతిభద్రతలు, నేర నియంత్రణపై అధికారులతో సమీక్ష
పుత్తూరు, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా పుత్తూరు సబ్‌డివిజన్‌లో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) మధుసూదన్ రెడ్డి, ఎస్పీ సుబ్బరాయుడు, నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, జిల్లా పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం డీజీపీ నూతన కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ కార్యాలయం ద్వారా పుత్తూరు సబ్‌డివిజన్ పరిధిలోని ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పోలీసులతో డీజీపీ సమీక్ష..
అనంతరం పుత్తూరు సబ్‌డివిజన్ పోలీసు అధికారులతో డీజీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళలు, చిన్నారుల భద్రత, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై సమగ్రంగా సమీక్షించి పలు సూచనలు చేశారు. ప్రతి ఫిర్యాదుపై సత్వర స్పందనతో చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో పోలీసు శాఖపై మరింత విశ్వాసం పెరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని డీజీపీ అధికారులకు సూచించారు. తిరుపతి జిల్లా పోలీసు శాఖ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన అభినందించారు.
