వివాహిత అనుమానాస్పద మృతి..
- భర్త, అత్తపై కేసు నమోదు
అల్లాదుర్గం, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని గడిపెద్దపూర్ గ్రామంలో సుస్మిత (23) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం… వికారాబాద్ జిల్లా మోతుకపల్లి గ్రామానికి చెందిన సుస్మితకు, గడిపెద్దపూర్ గ్రామానికి చెందిన గాజుల అభిలాష్‌తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వివాహమైన కొద్దిరోజుల నుంచే భర్త అభిలాష్ భార్యను అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడని, దీనికి అత్త శశిరేఖ కూడా తోడై సూటిపోటి మాటలతో తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవారని సమాచారం.
చివరకు సుస్మిత గర్భిణి అని కూడా చూడకుండా, కడుపులో పెరుగుతున్న బిడ్డకు డిఎన్ఏ పరీక్ష చేయించాలంటూ భర్త అభిలాష్ ఆమెను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసినట్లు ఆమె తల్లి తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన సుస్మిత గురువారం సాయంత్రం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి గాజుల జనాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త అభిలాష్, అత్త శశిరేఖలపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, నిందితులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, కేసును పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
