రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి..

  • చికిత్స పొందుతూ మృతి

ఇబ్రహీంపట్నం రూరల్, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్ తులిప్స్ హోటల్ సమీపంలో సుమారు 50 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండగా, తుర్కయంజాల్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని ఆటో ఢీకొట్టింది.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం బీఎన్‌రెడ్డిలోని భృంగి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, ఆయనను గుర్తించిన వారు లేదా వివరాలు తెలిసిన వారు ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు కోరారు.