ఓటు హక్కే ప్రజాస్వామ్యానికి శక్తివంతమైన ఆయుధం

మేడ్చల్‌లో ప్రారంభమైన ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం

మేడ్చల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మేడ్చల్ పట్టణం డివిజన్-297 పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్–Special Intensive Revision) కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలిస్తూ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు.

ఈ కార్యక్రమాన్ని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ పరిశీలించారు. అధికారుల పనితీరును స్వయంగా గమనించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధమని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ప్రజలంతా చురుకుగా పాల్గొనాలని కోరారు.

సర్వే కోసం ఇళ్లకు వచ్చే బీఎల్‌ఓ అధికారులకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని సూచించారు. ఓటరు నమోదు, సవరణలకు అవసరమైన సరైన పత్రాలను అధికారులకు అందజేసి, తమ పేరు ఓటర్ల జాబితాలో తప్పిపోకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ అవగాహన కార్యక్రమంలో ఏఎంసీ సాయి మాధురి, బీఎల్‌ఓ ఇందిరా, మేడ్చల్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లవంగు రాకేష్ వంజరి, మేడ్చల్ మున్సిపాలిటీ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు గుండ శ్రీధర్ కురుమ పాల్గొన్నారు.