love marriage | కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని…

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని అత్తవారింటి కుటుంబ సభ్యులే కర్రలతో కొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. మహేష్ యాదవ్ కుమార్తె ఊర్మిళను అనిల్ కుమార్ యాదవ్ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహాన్ని యువతి కుటుంబ సభ్యులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

ఈ నెల 21న భార్య సోదరుడి వివాహానికి హాజరయ్యేందుకు అనిల్ అత్తవారింటికి వెళ్లాడు. అక్కడ జరిగిన వాగ్వాదం అనంతరం అత్తవారింటి కుటుంబ సభ్యులు అతనిపై కర్రలతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్రంగా గాయపడిన అనిల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువతి తండ్రి మహేష్ యాదవ్, బావమరిది కల్లు యాదవ్‌తో పాటు మరికొందరిపై హత్య కేసు నమోదు చేశారు. నిందితుల పాత్రపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.