రాజకీయాల నుంచి పాఠ్యపుస్తకాల వరకు !!

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: 51 ఏళ్లైనా ఎమర్జెన్సీ అనే పదం భారత రాజకీయాల్లో వినిపిస్తే చాలు ప్రకంపనలు మొదలవుతాయి. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత వివాదాస్పద అధ్యాయంగా నిలిచిన 1975 అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)కి 51 ఏళ్లు పూర్తయ్యాయి. ఐదు దశాబ్దాలు దాటినా ఆ కాలం చుట్టూ రాజకీయ చర్చలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం “సంవిధాన్ హత్యా దివస్” పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, మరోవైపు ఎన్‌సీఈఆర్‌టీ కొత్త పాఠ్యపుస్తకాల్లో ఎమర్జెన్సీకి చోటు కల్పించడం రాజకీయంగా కొత్త వాదోపవాదాలకు దారితీసింది.

ఒకవైపు చరిత్రను యథాతథంగా విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అధికార పక్షం చెబుతుంటే, మరోవైపు దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో 1975 ఘటనలు మరోసారి జాతీయ చర్చాంశంగా మారాయి.

9వ తరగతి పుస్తకంలో ఎమర్జెన్సీ పాఠ్యంశం..

కొత్త విద్యా విధానం (NEP-2020) అమల్లో భాగంగా ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో అత్యవసర పరిస్థితిపై ప్రత్యేక వివరణ ఇచ్చారు. భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొన్న కీలక పరీక్షల్లో ఎమర్జెన్సీని ఒకటిగా పేర్కొంటూ, ఆ సమయంలో జరిగిన పరిణామాలను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. ఈ పాఠంలో రాజకీయ పరిణామాలు, ప్రజా అసంతృప్తి, పౌర హక్కులపై ప్రభావం, మీడియాపై నియంత్రణ, ప్రతిపక్ష నేతల అరెస్టులు, అనంతరం జరిగిన ఎన్నికల వరకు జరిగిన సంఘటనలను సమగ్రంగా ప్రస్తావించారు.

ఎమర్జెన్సీ ఎందుకు విధించారు?

1975లో దేశంలో రాజకీయ అస్థిరత, నిరసనలు, ఆర్థిక సమస్యలు, ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అధికారికంగా ఇది దేశ భద్రత, అంతర్గత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ నిర్ణయం అనంతరం దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పౌర హక్కుల వినియోగం…పై పరిమితులు విధించబడ్డాయి. అనేక ప్రతిపక్ష నేతలను నిర్బంధించారు. మీడియాపై కఠినమైన సెన్సార్ అమలులోకి వచ్చింది.

బీజేపీ వాదన ఇదే..

ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని బీజేపీ పేర్కొంటోంది. ఆ కాలంలో రాజ్యాంగ వ్యవస్థ, పౌర స్వేచ్ఛలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఆ విషయాలు ప్రతి విద్యార్థికి తెలియాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకులు అంటున్నారు. చరిత్రలో జరిగిన తప్పులను కొత్త తరానికి తెలియజేస్తేనే ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవచ్చని, అందుకే పాఠ్యపుస్తకాల్లో ఈ అంశాన్ని చేర్చడం సరైన నిర్ణయమని బీజేపీ సమర్థిస్తోంది. మరో వైపు ఈ నిర్ణయంపై ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష వ్యాఖ్యపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాబ్‌ పూనావాలా స్పందిస్తూ.. 1975 ఎమర్జెన్సీ జూన్‌ 25 ఓ చీకటి రోజుని.. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అధికారాన్నీ వినియోగించుకొని ఎమర్జెన్సీ ని ప్రకటించారిని విరుచుపడ్డారు.

ట్విట్టర్‌లో ప్రధాని మోదీ పోస్ట్..

ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) రోజులను భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. కేవలం పదవిపై ఉన్న స్వార్థంతోనే ఆనాటి ప్రధాని దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగానే రాజ్యాంగంపై గౌరవం ఉంటే.. ఆ రోజుల్లో జరిగిన దారుణాలకు గానూ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ప్రధాని డిమాండ్ చేశారు.

మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఎమర్జెన్సీ ఉదంతంపై కాంగ్రెస్ పార్టీ తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని గట్టిగా డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ అభ్యంతరాలేమిటి?

9వ తరగతి పాఠ్య పుస్తకాల్లో ఎమర్జెన్సీ అంశాన్ని పాఠ్యంశంగా చేర్చడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చరిత్రను ఎంపిక చేసుకుని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆరోపించింది. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్యా వ్యవస్థ సమస్యలు వంటి కీలక అంశాలపై చర్చ జరగకుండా దృష్టి మళ్లించేందుకే ఈ అంశాన్ని మళ్లీ ముందుకు తెస్తున్నారని విమర్శిస్తోంది. అంతే కాకుండా, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలినే ప్రతిపక్షాలు “అప్రకటిత ఎమర్జెన్సీ”గా అభివర్ణిస్తూ ఎదురుదాడి చేస్తున్నాయి.

ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ప్రధాన పరిణామాలు..

  • 1975 జూన్ 25న దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
  • దాదాపు 21 నెలల పాటు ఎమర్జెన్సీ అమల్లో కొనసాగింది.
  • పౌర హక్కులపై పలు పరిమితులు విధించబడ్డాయి.
  • వేలాది మంది ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు నిర్బంధంలోకి వెళ్లారు.
  • పత్రికల ప్రచురణపై ముందస్తు సెన్సార్ అమలులోకి వచ్చింది.
  • 1977 సాధారణ ఎన్నికల్లో అధికార మార్పు చోటుచేసుకుంది.

పాఠ్యపుస్తకాలపై ఎందుకు వివాదం?

విద్యా పుస్తకాలు చరిత్రను బోధించే సాధనాలా? లేక రాజకీయ భావజాలాన్ని ప్రభావితం చేసే వేదికలా? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. చరిత్రను పూర్తిగా బోధించాలా, లేక వివాదాస్పద అంశాలను ఎలా వివరించాలనే దానిపై విద్యావేత్తలు, రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. 1975లో విధించిన ఎమర్జెన్సీ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు.

ఐదు దశాబ్దాల తర్వాత కూడా అది రాజకీయ చర్చల్లో కేంద్రబిందువుగానే కొనసాగుతోంది. ఇప్పుడు అదే అంశం పాఠశాల తరగతి గదుల్లోకి చేరడంతో చరిత్ర, విద్య, రాజకీయాలు మరోసారి ఒకే వేదికపై చర్చకు వచ్చాయి. భవిష్యత్ తరానికి ఈ అంశాన్ని ఎలా పరిచయం చేయాలన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.