Gold Rate Today 13881/13220| పసిడి పరిస్థితి ఏమిటి?.. నిన్న తగ్గి.. నేడు పెరిగింది.. రేపు ఎలా ఉంటుంది?


అంతర్జాతీయంగా ఒత్తిడి.. దేశీయంగా స్వల్ప పెరుగుదల.. రూపాయి బలహీనపడితే మరింత పెరిగే అవకాశం
అంతర్జాతీయ మార్కెట్‌లో గ్రాము రూ.12,220.. దేశీయ మార్కెట్‌లో రూ.13,881.. రెండు మార్కెట్లకు భిన్న పరిస్థితులు

Gold Rate Today 13881/13220 | ఆంధ్రప్రభ వెబ్, బిజినెస్: ప్రపంచ ఆర్థిక పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజువారీగా హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి. ఒకరోజు తగ్గితే.. మరుసటి రోజు స్వల్పంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జూన్ 25న తగ్గిన బంగారం ధరలు.. జూన్ 26న దేశీయ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో రేపటి ధరలు ఎలా ఉంటాయనే ఆసక్తి కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల్లో నెలకొంది.

దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,200కు చేరుకోగా, 24 క్యారెట్ల బంగారం రూ.1,38,810గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే 22 క్యారెట్లపై రూ.800, 24 క్యారెట్లపై రూ.840 పెరిగాయి. గత కొన్ని రోజులుగా భారీ హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ, ప్రస్తుతం ధరలు స్వల్ప మార్పులతోనే కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా డాలర్ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కొనసాగుతున్న అనిశ్చితి, బాండ్ యీల్డ్స్ పెరగడం వంటి అంశాలు బంగారం ధరలపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు (31.10 గ్రాములు) సుమారు 4,028 అమెరికన్ డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.3.80 లక్షలు. అంటే అంతర్జాతీయ మార్కెట్‌లో గ్రాము బంగారం ధర సుమారు రూ.12,220గా ఉంది. ఇదే సమయంలో దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల గ్రాము ధర రూ.13,881గా నమోదైంది. దిగుమతి సుంకాలు, జీఎస్‌టీ, రూపాయి-డాలర్ మారకం విలువ, రిటైల్ ప్రీమియంల కారణంగా దేశీయ ధరలు అంతర్జాతీయ ధరల కంటే ఎక్కువగా ఉంటున్నాయి.

రూపాయి విలువే కీలకం

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం రూపాయి విలువ బలహీనపడితే దిగుమతి వ్యయం పెరుగుతుంది. దీంతో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినా, రూపాయి బలహీనత కారణంగా భారత మార్కెట్‌లో అదే స్థాయిలో తగ్గుదల కనిపించకపోవచ్చు.

బంగారం ధ‌ర‌ల్లో మార్పులు

జూన్ 19న బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా ఎగిశాయి. 22 క్యారెట్ల బంగారం రూ.1,33,700కు, 24 క్యారెట్ల బంగారం రూ.1,45,860కు చేరింది. ఆ తర్వాత జూన్ 20 నుంచి 22 వరకు స్థిరంగా కొనసాగిన ధరలు.. జూన్ 23 నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 25న మరింత తగ్గిన ధరలు.. జూన్ 26న మాత్రం స్వల్పంగా కోలుకుని మళ్లీ పెరిగాయి.

ప్రధాన నగరాల్లో ధరలు

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, పుణె వంటి ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,200గా, 24 క్యారెట్ల బంగారం రూ.1,38,810గా నమోదైంది. ఢిల్లీలో మాత్రం స్వల్ప తేడాతో 22 క్యారెట్ల ధర రూ.1,32,350, 24 క్యారెట్ల ధర రూ.1,38,960గా ఉంది.

రేపు ధరలు ఎలా ఉండొచ్చు?

రానున్న రోజుల్లో అమెరికా డాలర్ కదలికలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై వచ్చే సంకేతాలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, రూపాయి-డాలర్ మారకం విలువ బంగారం ధరల దిశను నిర్ణయించే అవకాశముంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒత్తిడి కొనసాగితే ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, రూపాయి బలహీనపడితే దేశీయ మార్కెట్‌లో మళ్లీ పెరుగుదల కనిపించే అవకాశాన్ని మార్కెట్ నిపుణులు కొట్టిపారేయడం లేదు.

గమనిక: బంగారం ధరలు రోజువారీగా మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు తాజా ధరలను సంబంధిత జ్యువెలరీ సంస్థ లేదా బులియన్ మార్కెట్‌లో ఒకసారి నిర్ధారించుకోవడం మంచిది.