దివీస్ ల్యాబ్స్‌లో ఘనంగా జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగోజిగూడెం గ్రామ పరిధిలోని ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ‘M/s. దివీస్ లేబొరేటరీస్’ (Divi’s Laboratories) నందు జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలు (జూన్ 26 నుండి జూలై 02 వరకు) శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలలో భాగంగా సంస్థలోని ఉద్యోగులకు, కార్మికులకు విద్యుత్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ సందర్భంగా పని ప్రదేశాలలో విద్యుత్ పరికరాలను సురక్షితంగా ఎలా వినియోగించాలి, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన వ్యక్తిగత భద్రతా జాగ్రత్తలు (PPE), అగ్నిమాపక పనిముట్ల (Fire Fighting Equipment) నిర్వహణపై నిపుణులు అవగాహన కల్పించారు.

ముఖ్యంగా పరిశ్రమల్లో ప్రమాద రహిత వాతావరణం కోసం పాటించాల్సిన ‘లోటో’ (LOTO – Lock out and Tag out) పద్ధతి ప్రాధాన్యతను ఉద్యోగులకు వివరించారు. అనంతరం విద్యుత్ భద్రతా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తామని ఉద్యోగులందరితో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ​ఈ కార్యక్రమంలో దివీస్ లేబొరేటరీస్ వైస్ ప్రెసిడెంట్ ఎస్. రామకృష్ణ, సేఫ్టీ జనరల్ మేనేజర్ బి. బాలకిషోర్, జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ రావి సురేష్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బొప్పన శ్రీనివాసరావు, ఇతర కంపెనీ ఉన్నతాధికారులు, రక్షణ విభాగపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.