కార్గో నౌకపై దాడి
కార్గో నౌకపై దాడి
హోర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత..
ఒమన్ సమీపంలో సింగపూర్‌కు చెందిన ‘ఎవర్ లవ్లీ’ నౌకపై దాడి
భద్రతా పరిస్థితుల పునఃసమీక్షకు ఐరాస నిర్ణయం
తాత్కాలికంగా నిలిచిన సముద్ర ఎస్కార్ట్ కార్యక్రమం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒమన్ సమీపంలో సింగపూర్‌కు చెందిన కార్గో నౌక ‘ఎవర్ లవ్లీ’పై దాడి జరగడంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి అనుబంధ అంతర్జాతీయ సముద్ర సంస్థ (ఐఎంఓ) భద్రతా పరిస్థితులను పునఃసమీక్షించేందుకు తన నౌకల ఎస్కార్ట్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.
ఇరాన్ ఆమోదించిన మార్గాల్లో ప్రయాణించని నౌకలకు భద్రత హామీ ఇవ్వలేమని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడి చోటుచేసుకుంది. బ్రిటన్ సముద్ర భద్రతా అధికారులు దాడిని ధృవీకరించగా, ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు ఈ ఘటన వెనుక ఇరాన్ హస్తం ఉండవచ్చని పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ దాడిపై ఇరాన్ ఇప్పటివరకు అధికారికంగా బాధ్యత స్వీకరించలేదు.
దాడి అనంతరం హోర్మూజ్ జలసంధి గుండా చిక్కుకుపోయిన వందలాది నౌకలు, వేలాది మంది నావికుల భద్రతపై సమీక్ష చేపట్టాలని ఐరాస నిర్ణయించింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఐఎంఓ చేపట్టిన భద్రతా ఎస్కార్ట్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది.
ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన వాటా హోర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఈ మార్గంలో ఎలాంటి భద్రతా అంతరాయం ఏర్పడినా అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందని, దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై కూడా పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
https://twitter.com/GUMMALLALAKSHM3/status/2070409758360633538/video/1
https://twitter.com/GUMMALLALAKSHM3/status/2070409758360633538/video/1
