మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే పోలీసుల ధ్యేయం
- పట్టణ డీఎస్పీ సి హెచ్.వివేకానంద
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ, అనంతరం మానవహారం నిర్వహించారు.
జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి డే అండ్ నైట్ జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీని శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ సీహెచ్. వివేకానంద జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, ఎక్సైజ్ శాఖ అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ మద్దతు తెలిపారు. అనంతరం డే అండ్ నైట్ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ వివేకానంద మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ‘మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం–మాదకద్రవ్యాల రహిత జిల్లా’ లక్ష్య సాధన కోసం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోందని తెలిపారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు గంజాయి, మత్తు మాత్రలు, ఇతర మాదక పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు, విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ రెడ్డి, జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ‘సంకల్పం–అభ్యుదయ సైకిల్ యాత్ర’ రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన పొందిందన్నారు. పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు సాగిన ఈ యాత్రలో సుమారు 50 వేల మందికి పైగా ప్రజలు పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు తెలిపారని చెప్పారు.
మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసులు మాత్రమే కాకుండా ప్రజలు, యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఈగల్–1972 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు, చట్టపరమైన చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని డీఎస్పీ తెలిపారు. “డ్రగ్స్‌కు నో చెప్పండి – జీవితానికి అవును చెప్పండి” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన, సురక్షితమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సీహెచ్. రామచంద్ర కుమార్, సీఐలు ఈశ్వరరావు, రామారావు, పోలీసు అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
