మాదకద్రవ్యాల నిర్మూలన బాధ్యత యువతదే: కదిరి డీఎస్పీ
కదిరిలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ
శ్రీ సత్య సాయి బ్యూరో, (ఆంధ్రప్రభ): అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కదిరి పట్టణంలో శుక్రవారం లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆర్&బీ బంగ్లా నుంచి ప్రారంభమై వేమారెడ్డి సర్కిల్, టవర్ క్లాక్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో కదిరి డీఎస్పీ శివ నారాయణ స్వామి, టౌన్ ఇన్స్పెక్టర్ డి.వి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ… మాదకద్రవ్యాల బారిన పడితే వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజం తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడలపై దృష్టి పెట్టాలని, మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని తెలిపారు. ఎక్సైజ్ అధికారులు వీరారెడ్డి, భువనేశ్వరి, రెడ్ సృజన్ సంస్థ డైరెక్టర్ భానూజ మాట్లాడుతూ.. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు.
ఎన్డీపీఎస్ చట్టం–1985 ప్రకారం మాదకద్రవ్యాల తయారీ, రవాణా, విక్రయం, వినియోగం శిక్షార్హమైన నేరాలని అధికారులు స్పష్టం చేశారు. సమాజంలో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించి, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓబులేసు డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు, వివిధ కళాశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు పోలీస్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
