యాదాద్రి ఈవోగా భవాని శంకర్‌కు మరో ఏడాది పొడిగింపు..
యాదగిరికొండ, ఆంధ్రప్రభ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)గా విధులు నిర్వహిస్తున్న జె. భవాని శంకర్, ఐఏఎస్ (2019 బ్యాచ్)కు తెలంగాణ ప్రభుత్వం మరో ఏడాది పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం భవాని శంకర్ ఈ నెల 30వ తేదీ (30-06-2026) మధ్యాహ్నం పదవీ విరమణ (సూపరాన్యుయేషన్) పొందనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధి పనులు, పరిపాలనా నిరంతరత, భక్తులకు మెరుగైన సేవల కల్పనను దృష్టిలో ఉంచుకుని, పదవీ విరమణ పొందిన మరుసటి రోజు నుంచి అమల్లోకి వచ్చేలా ఏడాది కాలపరిమితితో ఆయనను తిరిగి దేవస్థానం ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ (Special-A) బుధవారం విడుదల చేసిన జీవో ఆర్టీఈ నెం. 896 ద్వారా ఈ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జూన్ 23న జారీ చేసిన జీవో నెం. 878ను పరిగణనలోకి తీసుకుని తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ గవర్నర్ పేరిట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు.
ఉత్తర్వుల ప్రకారం, భవాని శంకర్‌కు చెల్లించే వేతన భత్యాలు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల మేరకు, ఆయన చివరిసారిగా పొందిన వేతనం నుంచి పెన్షన్ మొత్తాన్ని మినహాయించి నిర్ణయించనున్నారు.
యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణానంతర అభివృద్ధి పనులు, నిత్య కైంకర్యాల పర్యవేక్షణ, భక్తులకు మెరుగైన వసతుల కల్పనలో భవాని శంకర్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, ఆయన అనుభవాన్ని మరికొంత కాలం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పునర్నియామక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
