accident | ఇద్దరు మృతి.. మరో వ్యక్తి పరిస్థితి విషమం

accident | ఇద్దరు మృతి.. మరో వ్యక్తి పరిస్థితి విషమం

accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గచ్చిబౌలిలోని ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఇవాళ‌ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్న స్కూటీని ఎదురుగా వచ్చిన బుల్లెట్ బైక్ బలంగా ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న శ్రీకాంత్, విఠల్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. బుల్లెట్ బైక్‌ను నడుపుతున్న వినోద్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స్థానికుల కథనం ప్రకారం.. ఏఎంబీ ఫ్లైఓవర్‌పై తరచూ కొందరు వాహనదారులు రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని ఆరోపించారు. ట్రాఫిక్ నియంత్రణను మరింత కట్టుదిట్టం చేసి, రాంగ్‌రూట్‌లో వెళ్లేవారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రాణనష్టాలను నివారించవచ్చని వారు అభిప్రాయపడ్డారు.