ఊట్కూర్ మొహరం వేడుకల్లో పోటెత్తిన భక్తులు
- కోలాహలంగా హసేన్–హుస్సేన్ ఉయ్యాల వేడుకలు
- కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు ప్రాంతాల నుంచి భక్తుల రాక
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో జరుగుతున్న మొహరం మహోత్సవాలు శుక్రవారం నవమి సవారి సందర్భంగా అత్యంత వైభవంగా కొనసాగాయి. హసేన్–హుస్సేన్ పీర్ల ఉత్సవాల్లో పాల్గొనేందుకు తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు ఊట్కూర్కు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యంత వైభవంగా నిర్వహించే మొహరం వేడుకలకు ఊట్కూర్ ప్రత్యేక గుర్తింపు పొందింది.
నవమి సవారి సందర్భంగా పీర్ల ఊరేగింపు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగింది. ఊరేగింపు మార్గమంతా భక్తులు నీటితో రహదారులను శుభ్రపరచి పీర్లకు దట్టీలు, పూలమాలలు, చాదర్లు సమర్పించి బుక్క వేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. హిందూ–ముస్లిం సోదరభావానికి ప్రతీకగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు వేడుకల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.

వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన హసేన్–హుస్సేన్ ఉయ్యాల కార్యక్రమం ఊట్కూర్ పట్టణంలోని రుద్రానగర్ ప్రాంతంలో ఆనవాయితీ ప్రకారం నిర్వహించారు. ప్రతి ఏడాది కటిక కులానికి చెందిన కుటుంబంలో జన్మించిన మగ శిశువును ముందుగా ఉయ్యాలలో వేసిన అనంతరం పీర్లను ఉయ్యాలలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా భక్తులు ఉయ్యాలపై పూలు, బొనుగులు చల్లి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.
ఉయ్యాల వేడుక అనంతరం పీర్లపై చల్లిన పూలు, బొనుగులను సంతానం లేని దంపతులు భక్తితో స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందనే విశ్వాసంతో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సంప్రదాయం వేడుకలకు ప్రత్యేక ఆధ్యాత్మిక విశిష్టతను తీసుకువచ్చింది. మొహరం వేడుకలను తిలకించేందుకు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పీర్ల వద్ద కందూర్లు చేసి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో అధికారులు, పోలీసు సిబ్బంది విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసి వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. మొహరం వేడుకలకు వచ్చిన భక్తులకు సర్పంచ్ ఎం రేణుక భరత్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు వివిధ ఏర్పాట్లు చేశారు. మొహరం వేడుకల్లో మహిళల బొడ్డెమ్మలు, యువకుల అలాయి ఆటపాటలతో ఉత్సాహంగాజరుపుకున్నారు.
