Drug Addiction in India | డ్రగ్స్‌పై యుద్ధం.. ప్రభుత్వాలదే కాదు.. సమాజానిదీ

Drug Addiction in India | డ్రగ్స్‌పై యుద్ధం.. ప్రభుత్వాలదే కాదు.. సమాజానిదీ

Drug Addiction in India | మన వరకు రాలేదు కదా అనే నిర్లక్ష్యమే అసలు ప్రమాదం
నేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

Drug Addiction in India | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: ‘మా పిల్లాడు అలాంటివాడు కాదు’ ‘మా కాలనీలో అలాంటి సమస్య లేదు’, ‘అది పెద్ద నగరాల సమస్య’, ‘మన వరకు రాలేదు కదా’.. డ్రగ్స్‌ గురించి మాట్లాడిన ప్రతిసారీ సమాజంలో ఎక్కువగా వినిపించే మాటలు ఇవే. కానీ అసలు ప్రశ్న ఒక్కటే మన వరకు రాకముందే మనం మేల్కొంటామా? లేక మన ఇంటి తలుపు తట్టాకే స్పందిస్తామా? ప్రతి సంవత్సరం జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం వస్తుంది. ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు, ప్రతిజ్ఞలు, 2కే రన్‌లు, సమావేశాలు జరుగుతాయి. మరుసటి రోజు నుంచి మళ్లీ అంతా మామూలే. కానీ డ్రగ్స్ మాత్రం సెలవు తీసుకోవు. అవి ప్రతి రోజు కొత్త జీవితాలను నాశనం చేస్తూనే ఉంటాయి.

ఇది కేవలం చట్టం సమస్య కాదు
డ్రగ్స్‌ను చాలామంది ఇంకా లా అండ్ ఆర్డర్స మస్యగానే చూస్తున్నారు. పోలీసులు పట్టుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారు. కానీ వాస్తవం అంతకంటే పెద్దది.
ఇది ఒక ప్రజారోగ్య సమస్య, కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య, అన్నింటికంటే ముఖ్యంగా ఇది దేశ భవిష్యత్తు సమస్య. ఎందుకంటే డ్రగ్స్‌కు బానిస అవుతున్నది దేశ యువత. దేశానికి అత్యంత విలువైన మానవ వనరే ప్రమాదంలో పడుతోంది.

సమాజం ఎందుకు మౌనంగా ఉంది
ఒక రాష్ట్రంలో డ్రగ్స్ పట్టుబడితే వార్త చూస్తాం. మరో నగరంలో యువకుడు వ్యసనంతో చనిపోతే సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తాం. తర్వాత వెంటనే మర్చిపోతాం. ఎందుకంటే మనలో చాలామంది మన ఇంట్లో లేదు కదా.. మన పిల్లవాడు ఆ వార్తలో లేడు కదా.. మనకు సంబంధం ఏం ఉంది అనుకుంటారు.
అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. డ్రగ్స్ ఒక కుటుంబం నుంచి మరో కుటుంబానికి, ఒక కాలనీ నుంచి మరో కాలనీకి, ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి వ్యాపించే సమస్య. అది ఎవరి అనుమతి తీసుకుని రాదు.

మౌలిక ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నామా
పోలీసులు దాడులు చేస్తున్నారు. మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకుంటున్నారు. స్మగ్లర్లను అరెస్టు చేస్తున్నారు. ఇవన్నీ అవసరమే. కానీ మరో ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నామా.. అసలు యువత డ్రగ్స్ వైపు ఎందుకు వెళ్తోంది.. ఒత్తిడా.. ఒంటరితనమా.. తప్పుడు స్నేహాలా.. సోషల్ మీడియా ప్రభావమా.. ఉద్యోగ, ఉపాధి ఆందోళనా.. ఈ ప్రశ్నలకు సమాధానం వెతకకుండా కేవలం కేసులు నమోదు చేస్తే సమస్య మూలాలు అలాగే మిగిలిపోతాయి.

ప్రభుత్వం ఒక్కటే చేయలేని పని
ప్రభుత్వం చట్టాలు తీసుకురాగలదు. పోలీసులు తనిఖీలు చేయగలరు. కోర్టులు శిక్షలు విధించగలవు. కానీ, పిల్లలతో మాట్లాడేది కుటుంబమే. వారి ప్రవర్తనలో మార్పును ముందుగా గమనించేది తల్లిదండ్రులే.. స్నేహితుడిలో వచ్చిన మార్పును గుర్తించేది మరో స్నేహితుడే.. విద్యార్థి సమస్యను ముందుగా అర్థం చేసుకునేది ఉపాధ్యాయుడే. అంటే ఈ పోరాటంలో సమాజమే మొదటి రక్షణ కవచం..

నాకు సంబంధం లేదు అనే భావన మారాలి
రోడ్డు ప్రమాదం కనిపిస్తే వీడియో తీసే సమాజంగా కాకుండా… సహాయం చేసే సమాజంగా మారాలి. డ్రగ్స్‌కు బానిసైన యువకుడిని చూసి వెక్కిరించే సమాజంగా కాకుండా… అతడిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి చేయూతనిచ్చే సమాజంగా మారాలి. మన కాలనీలో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే సమాచారం ఇవ్వడం, పిల్లలతో తరచూ మాట్లాడటం, పాఠశాలల్లో అవగాహన పెంచడం, యువతకు క్రీడలు, ఉపాధి, సృజనాత్మక అవకాశాలు కల్పించడం కూడా డ్రగ్స్‌పై పోరాటమే. డ్రగ్స్ సమస్యను ప్రభుత్వం చూసుకుంటుంది అని వదిలేయడం ఎంత ప్రమాదకరమో, మన వరకు రాలేదు కదా అని అనుకోవడం అంతకంటే ప్రమాదకరం. ఎందుకంటే డ్రగ్స్ తలుపు తట్టే వరకు వేచి చూసే సమాజం… చివరికి తన భవిష్యత్తునే కోల్పోతుంది. మారాల్సింది ప్రభుత్వాలు, విధానాలు కాదు.. మారాల్సింది సమాజం.. మార్చాల్సింది దేశ భవిష్యత్తును!