Ketireddy Peddareddy | కేతిరెడ్డి హౌస్ అరెస్ట్
Ketireddy Peddareddy | కేతిరెడ్డి హౌస్ అరెస్ట్
Ketireddy Peddareddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గాంధీ కూడలిలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
తాడిపత్రిలో తమ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ గాంధీ కూడలిలో దీక్ష నిర్వహిస్తామని కేతిరెడ్డి ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని, అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దీక్ష చేపట్టడం సమంజసం కాదని వారు విమర్శించారు. దీక్షను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి పరిసరాల్లో పోలీసులు మోహరించి ఆయన బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు.
అదేవిధంగా తాడిపత్రి పట్టణంలోని గాంధీ కూడలి సహా కీలక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
