స్వర్ణకారుల వృత్తికి రక్షణ కల్పించాలి

  • కార్పొరేషన్, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్

మెదక్, ఆంధ్రప్రభ: స్వర్ణకారుల వృత్తిని రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించాలని, స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌తో పాటు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు పూనా రవీందర్ చారి, ప్రధాన కార్యదర్శి సుంకోజు దామోదర్ చారి డిమాండ్ చేశారు. గురువారం మెదక్ కలెక్టరేట్ ఎదుట విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఆమోదించిన ఐదుగురు సభ్యుల కమిటీ నివేదికను తమిళనాడు తరహాలో తెలంగాణలో అమలు చేయాలని కోరారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలో కూడా స్వర్ణకారుల కార్పొరేషన్, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జీఓ నెం.272కు సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ, దొంగిలించబడిన బంగారానికి సంబంధించి నిరాధార రికవరీ చర్యల నుంచి స్వర్ణకారులకు రక్షణ కల్పించే విధంగా మార్పులు అవసరమని పేర్కొన్నారు.

స్వర్ణకారులపై పోలీసుల వేధింపులను అరికట్టాలని, చేనేత మరియు గీత కార్మికుల మాదిరిగానే 50 ఏళ్లు పైబడిన స్వర్ణకారులకు నెలకు రూ.5 వేల పెన్షన్ అందించాలని కోరారు. వృత్తిని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడిన స్వర్ణకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం రాష్ట్ర కార్యదర్శి నెమలి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి వెంకటేశం, పట్టణ అధ్యక్షుడు బ్రహ్మచారి, కార్యదర్శి వేణు, కోశాధికారి కాశీనాథ్, శంకర్ దయాళ్ చారి, రవి, శ్రీనివాస్ చారి, జేఎల్ శ్రీనివాస్ చారి, నవీన్ రవీందర్ చారి, రమేష్ చారి, నరేష్ చారి, సిద్ధిరాములు, కిశోర్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.