నిజాయితీ చాటుకున్న ఆలయ ఎన్‌ఎంఆర్

బాసర, ఆంధ్రప్రభ: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్ సిబ్బంది దేవమ్మ నిజాయితీని చాటుకున్నారు. భక్తురాలు మరిచిపోయిన ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను భద్రపరిచి తిరిగి అప్పగించి అందరి ప్రశంసలు అందుకున్నారు. నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దర్శనం కోసం గురువారం హైదరాబాద్‌కు చెందిన స్వాతి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఉదయం అమ్మవారిని దర్శించుకుని అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయారు.

అయితే, తనతో తీసుకువచ్చిన ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను వసతి గృహంలోనే మరిచిపోయారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎన్‌ఎంఆర్ సిబ్బంది దేవమ్మ ఆ బ్యాగ్‌ను గమనించి భద్రపరిచారు.ల్యాప్‌టాప్ బ్యాగ్ కనిపించకపోవడంతో భక్తురాలు స్వాతి ఆన్‌లైన్ ద్వారా బాసర దేవస్థానం కార్యాలయానికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆలయ పీఆర్‌వో నారాయణ పటేల్ వసతి గృహంలో భద్రపరిచిన బ్యాగ్‌ను గుర్తించారు.

సాయంత్రం హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన భక్తురాలు స్వాతికి ఆలయ ఎన్‌ఎంఆర్ దేవమ్మ, ఆలయ పీఆర్‌వో నారాయణ పటేల్ చేతుల మీదుగా ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను అందజేశారు. ఆలయ సిబ్బంది చూపిన నిజాయితీ, బాధ్యతాయుత వ్యవహారాన్ని భక్తురాలు స్వాతి అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.