పాస్‌పోర్ట్‌ ఉంటే సరిపోదు.. పౌరసత్వంపై కేంద్రం స్పష్టీకరణ

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: భారత పాస్‌పోర్ట్‌ కలిగి ఉండటం మాత్రమే భారత పౌరసత్వానికి తుది రుజువుగా పరిగణించలేమని కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. పాస్‌పోర్ట్‌ అనేది ప్రధానంగా విదేశీ ప్రయాణాల కోసం జారీ చేసే అధికారిక పత్రం మాత్రమేనని, దానిని పౌరసత్వ ధ్రువీకరణ పత్రంగా పరిగణించరాదని పేర్కొంది. ఈ అంశంపై వచ్చిన వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అలాగే 2013లో బాంబే హైకోర్టు చేసిన పరిశీలనలను కూడా ప్రస్తావించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం పాస్‌పోర్ట్‌ ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే పత్రం మాత్రమే అని తెలిపింది.

అంతేకాకుండా ఆధార్ కార్డు, ఓటర్‌ ఐడీ, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌ వంటి పత్రాలు కూడా వ్యక్తి గుర్తింపును లేదా నివాసాన్ని నిర్ధారించే పత్రాలే తప్ప, అవి ఒక్కటే భారత పౌరసత్వానికి ఆధారాలు కావని అధికారులు తెలిపారు. ఒక వ్యక్తి భారత పౌరుడా కాదా అనే విషయాన్ని జనన ధ్రువీకరణ పత్రాలు, కుటుంబ రికార్డులు, పౌరసత్వ చట్టాలకు అనుగుణంగా ఉన్న ఇతర పత్రాల ఆధారంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు.

కేంద్రం వివరణ ప్రకారం, పాస్‌పోర్ట్‌ చట్టం-1967లోని కొన్ని నిబంధనల ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో భారత పౌరులు కాని వ్యక్తులకు కూడా ప్రయాణ పత్రాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల పాస్‌పోర్ట్‌ ఉందనే ఒక్క కారణంతో ఆ వ్యక్తి భారత పౌరుడేనని చట్టపరంగా నిర్ధారించలేమని తెలిపింది.

సాధారణంగా ప్రజలు పాస్‌పోర్ట్‌ను అత్యంత విశ్వసనీయ ప్రభుత్వ పత్రంగా భావిస్తారు. విదేశాలకు వెళ్లేందుకు ఇది తప్పనిసరి కావడంతో, చాలా మంది దీనినే పౌరసత్వానికి ప్రధాన ఆధారంగా చూస్తుంటారు. అయితే కేంద్రం తాజా వివరణతో పాస్‌పోర్ట్‌, ఆధార్‌, ఓటర్‌ ఐడీ వంటి పత్రాల చట్టపరమైన స్థితిపై మరోసారి చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో భారత పౌరసత్వాన్ని నిరూపించేందుకు ఏ పత్రాలు అవసరం? ఏ పత్రాలకు ఎంత చట్టబద్ధత ఉంది? అనే అంశాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కేంద్రం మాత్రం పౌరసత్వానికి సంబంధించిన ప్రతి అంశం పౌరసత్వ చట్టం, సంబంధిత రికార్డులు, అధికారిక ధ్రువీకరణ పత్రాల ఆధారంగానే నిర్ణయించబడుతుందని స్పష్టం చేసింది.