Women’s T20 WC-2026 | బంగ్లాదేశ్‌తో కీల‌క పోరు…

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ జట్టు కీలక దశలోకి చేరింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన భార‌త్ కు.. సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే బంగ్లాదేశ్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు (గురువారం) ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగే ఈ కీల‌క మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత జట్టు విజయం కోసం బరిలోకి దిగనుంది.

దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో భారత బౌలర్లు ప్రారంభంలో అద్భుతంగా రాణించారు. పవర్‌ప్లేలోనే ప్రత్యర్థిని 25/2 స్కోరుకు పరిమితం చేశారు. అయితే కీలక క్యాచ్‌లు మిస్ కావడంతో మ్యాచ్ భారత్ చేతుల నుంచి జారిపోయింది. బ్యాటింగ్‌లో స్మృతి మంధానా, షఫాలి వర్మ మంచి ఆరంభం ఇచ్చినా, మిడిల్ ఆర్డర్ ఫేయిల్ అవ్వ‌డంతో.. భార‌త్ కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. దీంతో భారత జట్టు పెద్ద స్కోర్ నమోదు చేయలేకపోయింది.

ఇక దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్ అద్భుత ప్రదర్శనతో తన జట్టుకు విజయం అందించింది. ఇక నేటి మ్యాచ్ లో భారత్ కూడా బంగ్లాదేశ్‌పై అలాంటి మ్యాచ్-విన్నింగ్ పెర్ఫార్మెన్స్‌ను ఆశిస్తోంది. పేపర్‌ప‌రంగా చూస్తే భారత జట్టు బంగ్లాదేశ్ కంటే బలంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదు. ప్రతి మ్యాచ్ ఇప్పుడు భారత్‌కు మ‌స్ట్ విన్ మ్యాచ్ గా మారింది.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్ ఇంకా తమ పూర్తి ఫామ్‌ను చూపించాల్సి ఉంది. మరోవైపు స్మృతి, షఫాలి, రిచా ఘోష్, దీప్తి శర్మ వరుసగా పరుగులు చేస్తూ జట్టుకు బలం చేకూరుస్తున్నారు. బౌలింగ్ విభాగంలో తాజాగా T20I నంబర్-1 బౌలర్‌గా నిలిచిన తెలుగ‌మ్మాయి శ్రీ చరణిపై కూడా భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. ఆమె అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తే బంగ్లాదేశ్ బ్యాటర్లకు కష్టాలు తప్పవు.

అయితే బంగ్లాదేశ్ జట్టును తక్కువ అంచనా వేయలేం. పాకిస్థాన్‌పై విజయం సాధించిన ఆ జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. భారత్‌కు టోర్నమెంట్‌లో నిలదొక్కుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు అత్యంత కీలకం. ఓటమి ఎదురైతే సెమీఫైనల్ అశాల‌కు దాదాపు తెర‌ప‌డే ప్రమాదం ఉంది. దీంతో, ఈ ప్రపంచ కప్‌లో నేటి మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది.