వేటగాళ్ల ముఠా గుట్టు రట్టు
వేటగాళ్ల ముఠా గుట్టు రట్టు
‘ఆపరేషన్ కవచ్’లో 8 మంది అరెస్ట్
కామారెడ్డి ప్రతినిధి, జూన్ 25 (ఆంధ్రప్రభ): జిల్లాలో నేరాల నియంత్రణ, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ కవచ్’ మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. అడవి జంతువుల అక్రమ వేటకు పాల్పడుతున్న ముఠాను గాంధారి పోలీసులు ఛేదించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఐదు నాటుతుపాకులు, ఒక ఎయిర్ గన్, భారీగా వేట సామగ్రి, రెండు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

వాహన తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన వేట ముఠా
జూన్ 24 రాత్రి గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొండి సడక్ చౌరస్తా వద్ద గాంధారి ఎస్ఐ మహేందర్ సిబ్బందితో కలిసి ‘ఆపరేషన్ కవచ్’లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన ఐదుగురు వ్యక్తులు పోలీసులను గమనించి వెనుదిరిగి పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద రెండు నాటుతుపాకులు, గన్‌పౌడర్, పొటాష్, స్టీల్ పెలెట్స్ (చెర్రలు), ఫెల్ట్స్ తదితర వేట సామగ్రి లభించడంతో లోతుగా విచారించగా, అడవి జంతువుల వేటకు వెళ్తున్నట్లు అంగీకరించారు. వర్షం కారణంగా వేట విఫలమై తిరిగి వస్తుండగా పోలీసుల తనిఖీల్లో చిక్కినట్లు వెల్లడించారు.
ప్రత్యేక బృందాలతో పూర్తి నెట్వర్క్ ఛేదింపు
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో సదాశివనగర్ సీఐ, గాంధారి, తాడ్వాయి పోలీసులతో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. విచారణలో బాన్సువాడ మండలం చిన్నరాంపూర్ గ్రామానికి చెందిన అస్లాం చావుస్ వద్ద నుంచి ఒక్కో నాటుతుపాకిని రూ.10 వేల చొప్పున కొనుగోలు చేసినట్లు నిందితులు వెల్లడించారు. కొనుగోలు చేసిన ఐదు నాటుతుపాకుల్లో మూడు ట్రిగ్గర్ మెకానిజంలు లేని కారణంగా వాటిని గండివేట్ తండా సమీపంలోని వ్యవసాయ పొలంలో దాచిపెట్టినట్లు చెప్పారు. పోలీసులు అక్కడ గాలింపు చేపట్టి మరో మూడు నాటుతుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చిన్నరాంపూర్ సమీపంలోని ఓ పౌల్ట్రీ ఫామ్ వద్ద ఉన్న మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ఒక ఎయిర్ గన్, మూడు ట్రిగ్గర్ మెకానిజంలు, మూడు వేట చాప్స్, స్టీల్ పెలెట్స్తో పాటు ఇతర వేట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు
పోలీసులు మొత్తం ఐదు నాటుతుపాకులు, ఒక ఎయిర్ గన్, మూడు ట్రిగ్గర్ మెకానిజంలు, మూడు వేట చాప్స్, గన్‌పౌడర్, పొటాష్, స్టీల్ పెలెట్స్, ఫెల్ట్స్, ఇతర వేట సామగ్రితో పాటు రెండు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో విస్లావత్ అరుణ్, విస్లావత్ గోపిచంద్, ఆంగోత్ లక్ష్మణ్, విస్లావత్ నాను, విస్లావత్ గణేష్, సలావత్ చందర్, ఆంగోత్ ధర్మ నాయక్‌తో పాటు అక్రమ ఆయుధాల సరఫరాదారు అస్లాం చావుస్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు
అక్రమ ఆయుధాల సరఫరా, వన్యప్రాణుల వేట ముఠా నెట్‌వర్క్‌ను సమర్థవంతంగా ఛేదించిన సదాశివనగర్ సీఐ బి. సంతోష్ కుమార్, గాంధారి ఎస్ఐ మహేందర్, తాడ్వాయి ఎస్ఐ నరేష్‌తో పాటు పోలీసు సిబ్బంది సంతోష్, పెంటయ్య, హోంగార్డు వీరప్రసాద్‌లను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించి నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో అక్రమ ఆయుధాల వినియోగం, వన్యప్రాణుల వేటకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమన్నారు. ‘ఆపరేషన్ కవచ్’ ద్వారా నేరస్థులపై నిరంతర నిఘా కొనసాగుతుందని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.
