Faima weds Praveenపెళ్లితో ఒక్కటైన ఫైమా – ప్రవీణ్
Faima weds Praveenపెళ్లితో ఒక్కటైన ఫైమా – ప్రవీణ్

Faima weds Praveen ఆంధ్రప్రభ వెబ్, బుల్లితెర : బుల్లితెరపై తన కామెడీతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ కమెడియన్ ఫైమా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దాదాపు తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకుంటూ ఆమె ప్రవీణ్ నాయక్‌ను పెళ్లి చేసుకుంది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా హైదరాబాద్‌లోని ఓ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ ప్రేమ వివాహం జరిగినట్లు తెలుస్తోంది.
‘పటాస్’, ‘జబర్దస్త్’ వంటి షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఫైమా, అనంతరం ‘బిగ్ బాస్’లో పాల్గొని మరింత ప్రజాదరణ సంపాదించింది. కెరీర్‌తో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలపై గతంలో అనేక రకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
జబర్దస్త్ వేదికపై ఫైమా, ప్రవీణ్ నాయక్ జంటగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ సమయంలోనే ప్రవీణ్ స్టేజిపైనే ఫైమాకు ప్రేమను వ్యక్తం చేయడం, ఆమె అంగీకరించడం చర్చనీయాంశమైంది. అయితే అది నిజమైన ప్రేమా లేక షోలో భాగమా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కాలక్రమేణా ఈ జంట తమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు.

తాజాగా రిజిస్ట్రేషన్ వివాహంతో తమ ప్రేమకు అధికారిక ముద్ర వేశారు. పెళ్లి అనంతరం ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్న ఫైమా భావోద్వేగ పోస్ట్ చేసింది.

“మా బంధాన్ని చాలామంది అనుమానించారు. మమ్మల్ని విమర్శించారు. మమ్మల్ని విడదీయాలని ప్రయత్నించారు. కానీ ప్రతి అడ్డంకికంటే మా ప్రేమే బలంగా నిలిచింది. ఎన్నో పోరాటాలు, అంతులేని సహనంతో ఈ స్థాయికి చేరుకున్నాం. ఒకరినొకరు వదిలేయడానికి వేల కారణాలు ఉన్నా, ప్రతిరోజూ ఒకరినే ఎంచుకున్నాం. ఈ రోజు మేము భార్యాభర్తలం” అంటూ ఆమె పేర్కొంది.
ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులతో పాటు బుల్లితెర ప్రముఖులు కూడా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
