మంత్రాలయంలో ‘కేడర్’కు సీఎం భరోసా

మంత్రాలయంలో ‘కేడర్’కు సీఎం భరోసా

డీలపడిన శ్రేణుల్లో ధైర్యం నింపేందుకే ప్రత్యేక భేటీ.
సంఘటనల నేపథ్యంలో దిశానిర్దేశంకు అవకాశం.
.సంస్థాగత బలోపేతంపై ఫోకస్

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : మంత్రాలయం రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలు, కేడర్‌లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. మాధవరంలో జరిగే కార్యకర్తల సమావేశం ద్వారా పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వడం, సంస్థాగత బలోపేతానికి దిశానిర్దేశం చేయడం, భవిష్యత్ రాజకీయ పోరాటానికి కేడర్‌ను సిద్ధం చేయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. రాజకీయంగా వేడెక్కిన మంత్రాలయంలో సీఎం సందేశం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం మంత్రాలయం నియోజకవర్గంలో నిర్వహించనున్న కార్యకర్తల సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారిక కార్యక్రమాల కంటే పార్టీ పరంగా కేడర్‌కు భరోసా కల్పించడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన మంత్రాలయం నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. గ్రామస్థాయిలో పార్టీ బలహీనపడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ, స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.

ఉద్రిక్త పరిణామాల తర్వాత కీలక పర్యటన
వారం రోజుల క్రితం కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమం అనంతరం మంత్రాలయం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కార్యక్రమం సందర్భంగా టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి నివాస ప్రాంగణంలోకి ద్విచక్ర వాహనాలతో ప్రవేశించిన ఘటన వివాదాస్పదంగా మారింది. దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, అనంతరం వాహనాల దహనం, పరస్పర ఆరోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడంతో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చినా, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది.

‘నేనున్నాను’ అనే సందేశమేనా?
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పర్యటనను పార్టీ వర్గాలు కీలకంగా భావిస్తున్నాయి. కేడర్‌లో నెలకొన్న నిరుత్సాహాన్ని తొలగించడం, కార్యకర్తలకు ధైర్యం చెప్పడం, పార్టీ వెన్నంటి నాయకత్వం ఉందనే సందేశాన్ని స్పష్టంగా పంపడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రత్యక్షంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకపోయినా, కార్యకర్తలకు “అధైర్యపడవద్దు… ప్రభుత్వం మీ వెంటే ఉంది… చట్టబద్ధంగా ముందుకు సాగండి” అనే తరహా సందేశం ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బూత్ స్థాయి బలోపేతంపైనే ప్రధాన చర్చ
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, గ్రామస్థాయి నాయకత్వ నిర్మాణం, సోషల్ మీడియా సమన్వయం, ప్రజా సమస్యలపై స్పందన వంటి అంశాలపై సీఎం ప్రత్యేకంగా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ముఖ్యంగా గ్రామాల్లో పార్టీ ప్రభావాన్ని పెంచేందుకు ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించే అవకాశముంది.

రాఘవేంద్రరెడ్డికి బలం చేకూర్చే ప్రయత్నమా?
మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి నాయకత్వానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు పిలుపునివ్వవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవలి ఘటనల నేపథ్యంలో నాయకత్వంపై కార్యకర్తల్లో విశ్వాసాన్ని మరింత పెంచే ప్రయత్నం కూడా ఈ సమావేశం ద్వారా జరగనున్నట్లు కనిపిస్తోంది.

సినిమా కాదు… సంస్థాగతం కు ముందస్తు వ్యూహం
ఇటీవల పరస్పర సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ వేడి పెరిగిన నేపథ్యంలో చంద్రబాబు కార్యకర్తలకు సంయమనం పాటించాలని సూచించే అవకాశముంది. వ్యక్తిగత ఘర్షణలు, ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని స్పష్టం చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

రాజకీయ సంకేతాలపై ఆసక్తి
మాధవరం వేదికగా జరిగే ఈ సమావేశంలో చంద్రబాబు చేసే వ్యాఖ్యలు కేవలం కార్యకర్తలకే కాకుండా మొత్తం రాయలసీమ రాజకీయాలకు సంకేతాలివ్వనున్నాయి. ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, రాజకీయ వ్యూహాలపై సీఎం ఎలాంటి సందేశం ఇస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.