తొలకరి జల్లులతో భీమ్గల్కు చల్లని ఊరట
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ: ఎదురుచూస్తున్న వానమ్మ ఎట్టకేలకు పలకరించింది. భీమ్గల్ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం సాయంత్రం కురిసిన తొలకరి జల్లులు ప్రజలకు ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించాయి. గత కొద్ది రోజులుగా మండుతున్న ఎండలు, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు వర్షం కురవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వర్షపు జల్లులతో రహదారులు తడిసి ముద్దవగా, వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మరోవైపు రైతులు కూడా ఈ వర్షాన్ని ఆనందంగా స్వాగతించారు. ఖరీఫ్ సాగు పనులకు తొలకరి వర్షాలు అనుకూలంగా మారుతాయని, వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
