ప్రతిభకు ప్రోత్సాహం.. టాపర్లకు నగదు పురస్కారాలు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహించడం సమాజం బాధ్యత అని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. తంగడపల్లి జడ్పీహెచ్ఎస్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి ప్రతిభావంతుల విద్యార్థులకు నగదు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భార్గవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్‌పర్సన్ విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సేవలందించి పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు మోటె సత్తయ్య విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్వచ్ఛందంగా నగదు బహుమతులు అందించడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.

పదో తరగతిలో 562 మార్కులతో ప్రథమ స్థానం సాధించిన మద్దుగాని మాస్వినికి రూ.3,116, ద్వితీయ స్థానం పొందిన నూతలపాటి మాధురికి రూ.1,116 నగదు పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, కౌన్సిలర్లు ఆలే శ్రీలత చిరంజీవి, రాజారత్నం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఊదరి పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.