స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలే లక్ష్యం

గెలుపు వ్యూహాలతో ముందుకెళ్తున్నాం: ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి

ఏలూరు, ఆంధ్రప్రభ: స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయబావుటా ఎగురవేయడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికలు, గెలుపు వ్యూహాలతో ముందుకు సాగుతున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు. కూటమి శ్రేణుల్లో ఐక్యతా స్ఫూర్తిని పెంపొందిస్తూ, ఉమ్మడి అజెండాను జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ఏలూరు అమీనాపేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రతి నెల చివరి బుధవారం నిర్వహించే జిల్లా కమిటీ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించారు.

జిల్లా పార్టీ అధ్యక్షుడు బడేటి చంటి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, కైకలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వీరమల్ల నరసింహారావు, కొడాలి వినోద్, మాజీ ఎమ్మెల్సీ కమ్ముల విటల్ బాబు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు జగ్గవరపు ముత్తారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులు జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా చేపట్టాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన కార్యాచరణపై మంతనాలు జరిపారు.

అలాగే ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించాలనుకున్న తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక ‘ఇంటింటికీ’ 45 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని సర్ (SER) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో 10 రోజుల తర్వాత ప్రారంభించాలని నిర్ణయించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన బడేటి చంటి, స్థానిక సమస్యలను తెలుసుకుంటూనే కూటమి పార్టీల ఐక్యతను ప్రజల్లో బలోపేతం చేస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రజల మద్దతు పొందేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.

సర్ ప్రక్రియ పూర్తైన తర్వాత ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో కొత్తగా ప్రవేశపెడుతున్న వివిధ యాప్‌లపై రైతులకు పూర్తి అవగాహన కల్పించిన తర్వాతే వాటిని అమలు చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.