కూలీల కొరతకు చెక్.. ‘న్యూమాటిక్ ప్లాంటర్’తో పత్తి సాగు భేష్!
- 50 నిమిషాల్లోనే ఎకరం పొలంలో విత్తనాల నాటడం పూర్తి
- వాక్యూమ్ టెక్నాలజీతో 15 శాతం వరకు అదనపు దిగుబడి
- కేవీకే బెల్లంపల్లి ఆధ్వర్యంలో పొలంపల్లిలో క్షేత్రస్థాయి ప్రదర్శన
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: ప్రస్తుత వానాకాలం సీజన్లో వ్యవసాయ కూలీల కొరత రైతాంగాన్ని తీవ్రంగా వేధిస్తోంది. సకాలంలో విత్తనాలు వేయలేక, వర్షాలు ముఖం చాటేస్తే నష్టపోతామనే ఆందోళనలో ఉన్న రైతులకు ఆధునిక యాంత్రీకరణ వరంగా మారుతోంది. రానున్న రోజుల్లో తీవ్రం కానున్న కూలీల కొరత దృష్ట్యా ఈ సాంకేతికత రైతులకు ఎంతో ఉపయోగపడనుంది. ఈ నేపథ్యంలోనే కన్నెపల్లి మండలం పొలంపల్లి గ్రామంలో రైతు మొగలి పొలంలో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) బెల్లంపల్లి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ‘న్యూమాటిక్ ప్లాంటర్’ యంత్రం ద్వారా పత్తి విత్తనాలు విత్తే ప్రదర్శన స్థానిక రైతులను విశేషంగా ఆకట్టుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు సాంకేతికత వైపు అడుగులు వేయాల్సిన అవసరాన్ని ఈ క్షేత్రస్థాయి ప్రదర్శన గుర్తుచేసింది.
సమయం, శ్రమ, పెట్టుబడి ఖర్చు ఆదా..
సాధారణ పద్ధతిలో పత్తి విత్తనాలు నాటాలంటే కూలీల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కానీ, ఈ ఆధునిక న్యూమాటిక్ ప్లాంటర్ యంత్రం ద్వారా కేవలం 50 నిమిషాల్లోనే ఒక ఎకరం విస్తీర్ణంలో పత్తి విత్తనాలు నాటడం పూర్తవుతుంది. సాంప్రదాయ పద్ధతుల కంటే ఇది చాలా వేగంగా పనిచేస్తుండటంతో రైతులకు సమయం, పెట్టుబడి ఖర్చు, ఇంధనం గణనీయంగా ఆదా అవుతాయి. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటే ‘అధిక సాంద్రత పత్తి సాగు’ పద్ధతికి ఈ యంత్రం అత్యంత అనుకూలమైనది.
వాక్యూమ్ టెక్నాలజీతో ప్రత్యేకతలు..
ఈ యంత్రం గాలి పీడనం (వాక్యూమ్) ఆధారంగా పనిచేస్తుంది. యంత్రంలో అమర్చిన గొట్టాల సక్షన్ ప్రెజర్ వల్ల విత్తనపు డబ్బా నుండి ఒకేసారి ఒక విత్తనాన్ని మాత్రమే పీల్చుకొని, నేలలో కరెక్ట్‌గా నాటుతుంది. మెకానికల్ ప్లాంటర్లలాగా ఇందులో విత్తనం నలిగిపోయే లేదా దెబ్బతినే అవకాశం అస్సలు ఉండదు. విత్తనాలు ఒకే క్రమపద్ధతిలో, సమాన దూరంలో, సరైన లోతులో పడటం వల్ల మొక్కల ఎదుగుదల ఏకరీతిగా ఉండి, నాణ్యమైన కాపు వస్తుంది. దీనివల్ల సాధారణ సాగు కంటే 10 నుంచి 15 శాతం వరకు అదనపు దిగుబడి సాధించవచ్చు.
అన్ని పంటలకూ అనుకూలం..
ఈ యంత్రం కేవలం పత్తికే కాకుండా మొక్కజొన్న, సోయాబీన్, వేరుశనగ, పొద్దుతిరుగుడుతో పాటు వివిధ రకాల కూరగాయల విత్తనాలు నాటడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మార్కెట్లో ఇవి 2, 4, 6 వరుసల మోడళ్లలో లభిస్తుండగా, ట్రాక్టర్ సహాయంతో సులభంగా నడపవచ్చు. ఈ ప్రదర్శన ద్వారా వరుసల మధ్య, మొక్కల మధ్య పాటించాల్సిన దూరం, సమతుల్య ఎరువుల వినియోగం, నేల సారాన్ని మెరుగుపరిచే సమగ్ర పంట యాజమాన్య
కూలీల కొరతకు ఆధునిక యాంత్రీకరణే పరిష్కారం
“రానున్న రోజుల్లో వ్యవసాయ రంగంలో కూలీల కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. దీనిని అధిగమించాలంటే రైతులు తప్పనిసరిగా ఆధునిక యాంత్రీకరణ వైపు అడుగులు వేయాలి. ఈ ‘న్యూమాటిక్ ప్లాంటర్’ యంత్రం ద్వారా తక్కువ సమయంలో, తక్కువ పెట్టుబడితో పత్తి విత్తనాలు నాటడం పూర్తవుతుంది. విత్తనాలు సమాన దూరంలో, కచ్చితమైన లోతులో పడటం వల్ల మొక్కల ఎదుగుదల ఏకరీతిగా ఉండి, 10 నుంచి 15 శాతం వరకు అదనపు దిగుబడి వస్తుంది. ముఖ్యంగా ‘అధిక సాంద్రత పత్తి సాగు’ చేసే రైతులకు ఈ సాంకేతికత ఎంతో లాభదాయకం.”
- డా. ఎన్. మహేష్, పంట ఉత్పత్తి శాస్త్రవేత్త, కేవీకే బెల్లంపల్లి

