చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి

  • నర్సంపేట మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు అలువాల శ్రీనివాస్

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ: ఉప సర్పంచ్‌ల సమస్యలు, డిమాండ్ల సాధన కోసం ఈ నెల 25న హైదరాబాద్‌లోని ధర్నా చౌక్, ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న “హలో ఉప సర్పంచ్.. చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నర్సంపేట మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు అలువాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్, జిల్లా అధ్యక్షుడు దండ నరేష్ సూచనల మేరకు కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉప సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా ఉప సర్పంచ్‌ల చెక్ పవర్‌కు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని, ఉప సర్పంచ్‌లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం, వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ఉప సర్పంచ్‌లకు స్థానిక పాలనలో తగిన గుర్తింపు, అధికారాలు కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సురేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ భూస బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి పలకొండ సూరయ్య, మంగ్య, శ్రీనివాస్, రాజన్న, జన్ను రమేష్, నరసయ్య, రవి, మానస, అఫ్జల్ ఎండీ, సునీత తదితరులు పాల్గొన్నారు.