సర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ కె. హరిత

జైనూర్, ఆంధ్రప్రభ: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కె. హరిత తనిఖీ చేశారు. కార్యాలయ నిర్వహణ, ఉద్యోగుల పనితీరును పరిశీలించిన అనంతరం తహసీల్దార్, రెవెన్యూ సిబ్బందితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న సర్ (ఎస్‌ఐఆర్) ఇంటింటి కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సర్వే పత్రాలను పంచాయతీల వారీగా, పోలింగ్ స్టేషన్ల వారీగా సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో కొత్త పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు అవసరమైన వారికి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండేలా ఫొటోగ్రాఫర్లతో సమన్వయం చేసుకోవాలని తహసీల్దార్‌కు సూచించారు.

కార్యక్రమంలో జైనూర్ తహసీల్దార్ ఆడ బిర్షావ్, ఆర్‌ఐ మోహన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.