ఈత పోటీల్లో మెరిసిన చిన్నారి రిషిక్..
రెండు బంగారు, 1 కాంస్య పతకం సొంతం
అచ్చంపేట, ఆంధ్రప్రభ: ఈత పోటీల్లో 7 ఏళ్ల చిన్నారి రిషిక్ అద్భుత ప్రతిభ కనబర్చి అందరి ప్రశంసలు అందుకున్నాడు. స్ట్రోక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్విమ్మింగ్ టోర్నమెంట్లో పాల్గొన్న రిషిక్ రెండు బంగారు పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్లో రెండో తరగతి చదువుతున్న రిషిక్ చిన్న వయసులోనే క్రీడల్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తుండటంతో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రిషిక్ సాధించిన ఈ విజయం కుటుంబ సభ్యులతో పాటు పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని పలువురు ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.
కాగా, రిషిక్ నల్లమల ప్రాంతానికి చెందిన అనూష ప్రాజెక్ట్స్ అధినేత, సామాజిక సేవల్లో గుర్తింపు పొందిన నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చెందిన అండపల్లి జలంధర్ రెడ్డి మనుమడు కావడం విశేషం. చిన్నారి విజయం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలతో ముంచెత్తుతున్నారు.
