రైతులు కోడెలను సంరక్షించి వ్యవసాయానికి వినియోగించాలి: విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, ఆంధ్రప్రభ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్ గోశాలలో బుధవారం నిర్వహించిన కోడెల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి గోశాలలో ఉన్న కోడెలను రైతులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న సన్నిధిలో భక్తులు మొక్కులు చెల్లించే సంప్రదాయంలో సమర్పించిన కోడెలను రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పలువురు రైతులకు కోడెలను పంపిణీ చేశామని, తాజాగా మరో 100 మంది రైతులకు కోడెలను అందజేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు కోడెలను వ్యవసాయ అవసరాలకే వినియోగించాలని, వాటిని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కోడెల సంరక్షణ కోసం మర్రిపల్లిలో 40 ఎకరాల భూమిని కేటాయించినట్లు వెల్లడించిన ఆయన, అక్కడ ఆధునిక సదుపాయాలతో గోశాల నిర్మాణం చేపడతామని చెప్పారు. భవిష్యత్తులో ఇతర జిల్లాల రైతులకు కూడా కోడెలను పంపిణీ చేస్తామని, రైతులు వాటిని సంరక్షిస్తూ వ్యవసాయంలో వినియోగించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
