ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (యాంటీ డ్రగ్స్ డే) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ పూజారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చని అన్నారు.
ప్రస్తుతం సమాజంలో గంజాయి, మద్యం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు యువతను శారీరకంగా, మానసికంగా బలహీనులను చేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఇలాంటి ప్రమాదకరమైన వ్యసనాలకు దూరంగా ఉండి విద్యాభ్యాసం, లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు.
కార్యక్రమంలో అధ్యాపకులు రవీందర్, అంతయ్య, జితేందర్ రెడ్డి, రాములు, పరుశరాములు, వెంకటరమణ, అబ్బాస్, జూకంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
